తెలంగాణ లో షాహు మహరాజ్ జయంతి


26.06.2020 : శుక్రవారం ఉదయం కాపు కులం కు చెందిన రాజాశ్రీ షాహు మహారాజ్ 146వ. జయంతిని పొరుమల్ల గ్రామంలో మేడిపల్లి మండలం జగిత్యాల జిల్లా ఊరి అంబేడ్కర్ సంఘం ఆవరణలో ఘనంగా జరిపారు.


ఈ సందర్భంగా, తెలంగాణ కు చెందిన 
 ముంబై వలస జివి  ముంబై తెలంగాణ బహుజన ఫోరం కన్వీనర్ మంద రాజు మహారాజ్ మాట్లాడుతూ రాజశ్రీ షాహు మహారాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏడవ వంశస్తులు. వీరు దేశంలో తొలిసారిగా 1902 లో ఎస్సి ఎస్టీ బీసీలకు 52 శాతం రిజర్వేషన్లను అమల్లో పెట్టిన సమతావాది. ఇంతేగాకుండా, తన మహారాష్ట్ర కొల్హాపూర్ సంస్థానంలో అన్ని వర్గాలకు ప్రాథమిక నిర్బంధ విద్యను తప్పనిసరిగా చేశారు. ఐతే "షాహు మహారాజ్ జయంతిని దీపావళి పండుగ వలె ఘనంగా జరుపుకోవాలి అంటూ డాక్టర్ అంబేడ్కర్ బహుజనులకు ఇచ్చిన పిలుపును మంద రాజు మహారాజ్ జ్ఞాపకం చేశారు.


ఈ జయంతి ఉత్సవంలో పొరుమల్ల అంబేడ్కర్ సంఘం నాయకులైన బడే సత్తయ్య మాల, సావనపల్లి అబ్రహం, చిట్యాల రఘు మాదిగ, బి. గంగారాం మాల, ఎం. ఎల్లయ్య మాదిగ,  బొమ్మేన లక్ష్మన్, బడే రాజు తదితరులు పాల్గొన్నారు.


కాపు కులం కు చెందిన  మహాపురుషులా ఉత్సవాలు దళితులు జరుపుతున్నారు బీసీలు కూడా జరపాలి అని మూల్ నివాసి మాల తెలియచేశారు.


బహుజన చక్రవర్తి భారతీయ మొదటి రిజర్వేషన్ల సృష్టికర్త ఛత్రపతి సాహు మహారాజ్ 146వ జయంతి బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ (బిఎల్టీయూ) జిల్లా కమిటీ ఆద్వర్యంలో ఈరోజు సాయంత్రం నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ముందు జయంతి కార్యక్రమం నిర్వహించారు.


నినాదాలతో వ్యవస్థ మారదు, విధానాలతోనే వ్యవస్థ మారుతుంది అని బిఎల్టీయూ నాయకులు వెంకట్ తెలిపారు


భారతదేశ రిజర్వేషన్ల పితామహుడు - సామాజిక న్యాయ దీపస్థంభం ,భారత సామాజిక ప్రజాస్వామ్య మూలస్థంభం " రాజర్షి ఛత్రపతి సాహు మహారాజ్  (26/06/2020 )146 వ జయంతి :    


మహారాష్ట్రలో జన్మించిన పూలే - సాహూ - అంబేడ్కర్ మహానీయుల ఉద్యమం 1848లో మొదలై 1956 వరకు 108 సంవత్సరాలు సుధీర్ఘంగా కొనసాగింది. ఈ ముగ్గురు మహానీయుల ఆశయం ,లక్ష్యం ఒక్కటే.


మహాత్మా పూలే వారసునిగా ఆయన ఆశయాల సాధనకు నిరంతరం కృషి చేసిన సాహూ భారతదేశ చరిత్రలో బహుజనులను బ్రాహ్మణుల పెత్తనం నుండి విముక్తి చేయటానికి సైద్ధాంతికంగా., పాలనపరంగా మహాత్మ జ్యోతిబా పూలే., ఛత్రపతి శివాజీల వారసుడిగా కృషి చేసి భవిష్యత్ భారతానికి సామాజిక న్యాయ-ప్రజాస్వామిక తాత్విక పునాదిని ఏర్పరచి ప్రజల రాజుగా మిగిలిపోయిన మహానీయుడు రాజర్షి "ఛత్రపతి సాహుమహారాజ్". 
ఘాట్గేలు మహారాష్ట్ర లో వెనుకబడిన తరగతులకి ( ఓబీసీ ) చెందిన వ్యవసాయం చేసుకుని జీవించే కున్భీ కులం. సాహు చిన్నతనమంతా ఆంగ్లేయ అధ్యాపకుల పర్యవేక్షణ లో జరిగినందున ఆధునిక భావాలు పుణికి పుచ్చుకున్నాడు........
యుక్తవయసు రాగానే 1894 ఏప్రియల్ 2 న సింహాసనం అధిష్టిస్తాడు సాహు . 1900 వ సంవత్సరం అక్టోబర్ నెలలో ఒక రోజు సాహు మహారాజ్ పంచగంగా నదిలో స్నానం చేస్తున్న సమయంలో బ్రాహ్మణ పురోహితుడు స్నానం  చేయకుండానే వచ్చి సాహు మహారాజ్ క్షత్రియ వంశస్తుడు కానందున ఒక వ్యవసాయం  చేసుకునే కులానికి చెందిన శూద్రుడైనందున ఈశడిoపుతో వేదోక్త మంత్రాల బదులు పౌరాణిక  మంత్రాలు చదివి అవమానిస్తాడు . పుట్టుకతోనే మనిషి కులం నిర్ణయించబడుతుందనీ రాజైనంత మాత్రాన , దత్తత వచ్చినంత మాత్రాన క్షత్రియుడిగా మారిపోడని వాదనకు దిగుతాడు. ఈ సంఘటన సాహు మహారాజ్ ని "మహాత్మ జ్యోతిబాపూలే" వారసునిగా  "సత్యశోధక సమాజ్" ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కారణమైంది. తను సింహాసనం అధిష్టించే నాటికి తన రాజ్యంలో మత కర్మలలో మొదలు పరిపాలనలోని అన్ని ఉద్యోగ  రంగాలతో పాటు వ్యాపారం , వడ్డీ వ్యాపారం లో కూడా బ్రాహ్మణులే నిండిపోవడం సాహు గమనించాడు. బ్రాహ్మణేతరులని ఉన్నతోద్యాగాల్లోకి తెస్తే తప్ప వారి సామాజిక హోదాలో , జీవితాల్లో మార్పు రాదని , బ్రాహ్మణ ఆధిపత్యానికి అడ్డుకట్టపడదని సాహు భావించాడు . తన ప్రైవేట్ సెక్రెటరీ ఉద్యోగానికి అండర్ గ్రాడ్యేట్  ( డిగ్రీ స్థాయి లేని ) అయిన ఒక జైనుడిని ఎన్నిక చేసుకుంటే బ్రాహ్మణ సమాజం ఏకమై పెద్ద ఎత్తున నిరసన తెలియచేసింది. ఐతే ఆ రాజ్యంలో అప్పటికి గ్రాడ్యేషన్ పూర్తి చేసిన బ్రాహ్మణేతరుడు ఒక్కరు లేరు. సమస్యను గుర్తించిన సాహు వెనుకబడిన కులాల వారందరికి స్కూల్స్ , హాస్టల్స్  ప్రారంభించి విద్యని ఒక ఉద్యమంగా నడిపాడు . కొల్హాపూర్ పట్టణంలో హాస్టల్స్ కాలనీనే నిర్మించాడు. ప్రతి గ్రామంలో కనీసం ఒక ప్రాథమిక పాఠశాలనేర్పరచి అందరికి , అన్ని కులాల వారికి ఉచిత నిర్భంధ ప్రాథమిక విద్యనందించాడు. అన్ని కులాల ,మతాల వారు కలిసిమెలిసి ఏ పాఠశాలలోనెైన , విద్యా సంస్థలో నైనా చదువొచ్చని ప్రకటన ఇచ్చింది సాహు ప్రభుత్వం. వ్యవసాయం ఇతర వృత్తులు చేసే వయోజనుల కోసం రాత్రి పాఠశాలలు ఏర్పడ్డాయి. జులై 26 , 1902 భారత దేశ చరిత్రలో ఒక చరిత్రాత్మక దినం. ఆ రోజు ఛత్రపతి సాహు మహారాజ్ ప్రభుత్వం , ప్రభుత్వ పాలన వ్యవహారాల్లో ' ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంత ' ఉండాలనే ఆలోచనతో  ప్రభుత్వోద్యోగాలన్నింటిలో వెనుకబడినవర్గాల వారికి  50% రిజర్వేషన్ లు కల్పిస్తూ సంచలనాత్మక ఉత్తర్వులని జారీ చేసింది .                                                   
బాలగంగాధర తిలక్  లాంటి బ్రాహ్మణ జాతీయోద్యమ నాయకులు సాహు మహారాజ్ నడిపిస్తున్న పూలే వారసత్వ ఉద్యమాన్ని , పరిపాలన లో చేస్తున్న మార్పులని చూసి ఓర్వలేక అనేక కుట్రలు చేసి దాడికి దిగేవారు.............                                                                         
సాహు మహారాజ్ తో పరిచయంతో బాబాసాహెబ్ అంబేడ్కర్ సాహూ అంటే ఎంతో అభిమానంతో ఉండేవాడు. బాబాసాహెబ్ అంబేడ్కర్ సాహు మహారాజ్ ల మద్య పరిచయం పెరిగి రాబోయే బ్రిటీష్ చట్టాలు మంచిచెడుల గురించి మాట్లాడుకునేవారు. అంబేడ్కర్ ఆస్పృశ్యుల హక్కుల సాధన కోసం ఒక పత్రిక పెట్టాలనుకుంటున్నాననీ , ఐతే ఆర్థిక ఇబ్బందులతో చేయలేకపోతున్నానడంతో ఆ పత్రిక కి ఆర్థిక వనరులు సమకూర్చే బాధ్యతను తీసుకొని మొదట 2500 రూపాయలు ఇవ్వడంతో ' మూక్ నాయక్ ' పత్రిక ప్రారంభమౌతది.1920 , ఏప్రియల్ 15 న నాసిక్ లో అంబేడ్కర్ మరియు మిత్రులు  అంటరానివారికోసం ఒక హాస్టల్ కట్టాలనుకుంటే ఆ కార్యక్రమ ప్రారంభోత్సవానికి హాజరై ఐదు వేల రూపాయలు ఇస్తాడు సాహు. 1920 లో అంబేడ్కర్ ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకొనుటకై ఆర్థిక సహాయం చేస్తాడు సాహు మహారాజ్ . అంబేడ్కర్ విదేశాల్లో ఉన్నంత కాలం ' మూక్ నాయక్ ' పత్రిక నిర్వహణ కి ఆర్థిక సహాయం చేసాడు .రమాబాయి యోగక్షేమాలను విచారిస్తూ , ఆమెకు అవసరమైన ఆర్థిక సహాయం చేస్తూ బాధ్యత గల స్నేహితుడిగా వ్యవహరించాడు సాహు. 1922 ఫిబ్రవరి 16న డిల్లీలో జరిగిన అంటరాని కులాల జాతీయ మహాసభలో పాల్గొన్న సాహు ' ఈ సభలో ప్రసంగించే అర్హత నాకన్నా గొప్ప వ్యక్తి  అంబేడ్కర్‌ కే ఉందని ఇంగ్లాండ్ లో ఉన్నందున పాల్గొనలేకపోవడం మన దురదృష్టమని మీ జాతి గర్వించదగిన మహోన్నత నాయకుడు అంబేడ్కర్ ను మీరందరు ఆదర్శంగా స్వీకరించాలని ,ఆయన స్థాయికి అందుకోవడానికి మీ అభివృద్ధికి కావలిసిన సేవలను అందించడానికి నన్ను అనుమతించమని ప్రార్థన ' అంటూ మాట్లాడాడు.
ఒక ఉద్యమాన్ని నడిపించే నాయకుడు కేవలం ఉపన్యాసాలిస్తే సరిపోదని తను చెప్పి  ఆచరించి చూపించాడు సాహు మహారాజ్ .                                        


మరువకండి మహానుభావులను - సాదిద్దాం వారి ఆశయాలను - కొనసాగిద్దాం వారి ఆలోచనావిధానాన్ని - కొల్లికొండ వెంకట సుబ్రమణ్యం రాష్ట్ర కన్వీనర్ ,నిరుద్యోగ ఐక్యవేదిక  (సాహుమహారాజ్ - రచన కాత్యాయని).